Tuesday, 28 October 2014

వచన కవిత్వంవైపు నడిపించిన పుస్తకం..

చిన్నప్పటి నుంచే పద్యం దారిలో నడస్తున్న నన్ను అకస్మాత్తుగా వచన కవిత్వం వైపు లాగి పుస్తకం దుఃఖనది. నిర్మల్‌కు చెందిన ప్రసిద్ధ కవి మునిమడుగుల రాజారావు గారి రెండవ కవితా సంకలనం దుఃఖనది. అది సెప్టెంబర్25, 2005. అటు రాజారావుతోనూ, ఇటు వచన కవిత్వంతోనూ నాకంతగా పరిచయం లేదు. ఆ పుస్తకావిష్కర ణ తరువాత చిన్న పిల్లవానికి బూరు మిఠాయి దొరికినంత సంబురంగా పుస్తకం మొత్తం చదివిన.

నాకు వచన కవిత్వం పరిచయం కావడానికైనా, వచన కవిత్వ ప్రపంచంలోకి నన్ను స్వాగతించిన పెద్ద దర్వాజ దుఃఖనది. అప్పటి దాకా అనేక నిబంధనలతో కూడిన పద్య కవిత్వం రాయటం, చదవటంలో మునిగిపోయిన నేను.., దుఃఖనది చదువుతున్నంత సేపూ ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలిగింది. భవిష్యత్తులో వచన కవిత్వమే నాకు ప్రధాన వాహిక కాబోతున్న సంగతి బహుశా ఆ ఆనందంలో ఆనాడు నేను గుర్తించలేదు.

బాధ కవిత్వానికి పర్యాయ పదం అన్నాడు శ్రీశ్రీ. మనసులో బాధ లేకుండా కవిత్వం పుట్టిన దాఖలాలు అరుదు. సంఘర్షణ అయినా, దుఃఖం అయినా బాధకు ఇతర రూపాలు. బాధకు ఉన్నత రూపమైన (అత్యున్నత రూపం శోకం) దుఃఖాన్ని వస్తువుగా గ్రహించిన రాజారావు నిజంగానే ఉన్నతమైన కవిత్వాన్ని సృష్టించాడు.నది కదా జీవితం అంటాడు విలవిలలాడే నది కవితలో రాజారావు. జీవితంలో సుఖదుఃఖాలుంటాయి. సుఖం లో కన్నా దుఃఖంలోనే మనిషి మనిషితనం బయటపడుతుంది.

మనిషి దుఃఖపడుతున్నప్పుడే లోపట ఏ కల్మశమూ లేకుండా స్వచ్ఛంగా ఉంటాడు. అందుకేనేమో రాజారావు దుఃఖాన్ని పట్టించుకున్నాడు. తన కవిత్వాన్ని దుఃఖనది చేసుకున్నాడు. నాకు దుఃఖనది చదువుతున్నంత సేపూ నిజంగానే దుఃఖం కలిగింది. కవి ఏదయితే అనుభూతి చెంది రాశాడో, అదే అనుభూతి పాఠకుడు కూడా పొందగలిగితే అదే ఉత్తమ కవిత్వం. దుఃఖనది అలాంటి కవిత్వం.
రాజారావుకు ఎందుకంత దుఃఖం అని ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే.. మనిషిని కాబట్టి అనే ఆయన సమాధానమిస్తాడనుకుంటాను. కాళోజీ గారి విషయంలో ఆయన గొడవ ఎలాంటిదో రాజారావు గారి దుఃఖం అలాంటిదే. కేవలం దుఃఖం మాత్రమే పరిష్కారాలను సూచిస్తుందా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

కానీ కవిత్వమంతా చదివితే కానీ అసలు విషయం అర్థం కాదు. ముందుమాటలో గుడిపాటి అన్నట్లు దుఃఖాన్నీ, మృత్యువునీ గురించి నిష్క్రియాపరమైన వేదాంతం రాజారావు కవిత్వంలో కనిపించదు. ఇవ్వాళ మనిషిని వెంటాడుతున్న మృత్యువుకీ, దుఃఖానికీ మూలాలు వ్యవస్థ క్రూర స్వభావం లో ఉన్నాయన్న ఎరుక ఈ కవిత్వంలో వుంది.

ఆ ఎరుకే ఈ కవిత్వానికి ప్రాసంగికతను కల్పిస్తున్నది. మరణించటమంటే ప్రాణం పోవటం కాదు, యుద్ధం ఆగిపోవడంగా అర్థం చేసుకున్న రాజారావును అర్థం చేసుకోవటం అంత ఇబ్బందేం కాదు. గాఢమైన తాత్వికతను వొలుచుకుంటూ వెళితే ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకోవటం కూడా ఇబ్బందేం కాదు. దుఃఖంలో కూడా వికసించిన మానవ చైతన్యానికి ప్రతిరూపమే దుఃఖనది. అంతటి ప్రతిభావంతమైన పుస్తకం కాబట్టే.. దుఃఖనది నా కవితా పథాన్ని పూర్తిగా మార్చేసిన పుస్తకంగా భావిస్తున్నాను.
- తోకల రాజేశం, 9676761415

( నమస్తే తెలంగాణ దినపత్రిక చెలిమె లో ప్రచురితమైన నా జ్ఞాపకం )

No comments:

Post a Comment