- తోకల రాజేశం, తెలంగాణ రచయతల వేదిక 20/10/2014
‘ఆంధ్రభూమి’ దినపత్రికలో అక్టోబర్ 16, 2014నాడు హెబ్బార్ నాగేశ్వర్‌రావుగారు రాసిన ‘‘మాతృ సంస్కృతి ప్రస్ఫుటిస్తున్న మాధ్యమం’’అన్న వ్యాసం కొన్ని అనుమానాలతో, కొన్ని అసత్యాలతో మరియు కొన్ని వితండ వాదనలతో నిండి వుంది. ప్రజలు సంస్కృతానికి దూరమై సంస్కృతికే దూరమైపోయారని రచయిత తెగ బాధపడిపోతున్నారు.
1972 నుంచి అవిభాద్య ఆంధ్రప్రదేశ్‌లో కంపోజిట్ తెలుగు పాఠ్యాంశంగా వుండేది. దీని ప్రకారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతులలో ఒక సబ్జెక్టుగా తెలుగుకు బదులు సంస్కృతాన్ని ఐచ్ఛికంగా చదువుకునే వీలుండేది. నిపుణుల సలహామేరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- రెండు రాష్ట్రాలుగా విడిపోవటానికంటే కొన్ని నెలల ముందే ఈ విధానాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులనిచ్చింది. కొన్ని ఒత్తిడుల నేపధ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈనెల 10న యధాతథ స్థితిని పునరుద్ధరించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సంస్కృత భాష విషయంలో తీసుకున్న ఈ చిన్న సానుకూల నిర్ణయాన్ని ఆధారం చేసుకున్న నాగేశ్వర్‌రావుగారు- ఇదే అదునుగా భావించి సంస్కృతాన్ని బలవంతంగా ప్రజలందరి మీద రుద్దాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
‘‘జనని సంస్కృతంబు సకల భాషలకును’’ అని ప్రాచీన కవులు అన్నారని మనం అమాయకంగా నిజమో కాబోలునని నమ్మనక్కరలేదు. ఈరోజు శాస్త్ర విజ్ఞానంతోబాటు భాషాశాస్త్ర విజ్ఞానమూ అభివృద్ధి చెందింది. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని భాషా శాస్తజ్ఞ్రులు నిరూపించారు. కాకపోతే చారిత్రక కారణాలవల్ల సంస్కృత భాషా పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. పువ్వునుంచి మరో పువ్వు పుట్టని విధంగానే ఒక భాష నుంచి మరో భాష పుట్టలేదన్న సంగతి హెబ్బార్‌వారు గుర్తించాలి.
సంస్కృతానికి నిలువ నీడలేకుండా పోతోందని విచారం వ్యక్తంచేస్తున్నారు రావుగారు. అలా విచారించేకంటే ముందు సంస్కృతం సామాన్య ప్రజలకు ఏపాటి సేవ చేసిందో చెప్పి వుంటే రావుగారికి ప్రజలందరి మద్దతు లభించి వుండేది. కానీ వారు చెప్పలేరు. ఎందుకంటే ఆ భాష సేవ చేసింది ప్రజలకు కాదు బ్రాహ్మణ పండితులకు, రాజులకు. ప్రాచీన కాలంలోని కవులు కూడా ఇదే రెండువర్గాలనుంచి ఉండటంవల్ల- వాళ్ల కవిత్వానికీ మాధ్యమం సంస్కృతమే అయ్యింది. ఈ ముగ్గురితో తప్పితే సంస్కృతానికి సామాన్యులతో పనిలేదు. సామాన్యులకు కూడా సంస్కృతంతో పనిలేదు. ఈ నేపథ్యంలో సాహిత్య చారిత్రక పరిశోధకులు, ప్రసిద్ధ విమర్శకులైన త్రిపురనేని మధుసూధనరావు మాటలు అందరూ గమనించదగ్గవి. ‘‘సంస్కృత భాష భూస్వామ్య వ్యవస్థలోని పాలకవర్గ భాష. కవులకీ, పురోహితులకీ, రాజులకీ తప్ప సంస్కృత భాష ఆ కాలంలో ఎవరికీ రాదు. భారతదేశంలో జన వ్యవహారంలో అది ఎన్నడూ లేదు. ఎక్కడయినా, ఎప్పుడయినా సంస్కృతం మాతృభాషగా గల సమాజం వుందని చెప్పడానికి కూడా చారిత్రకంగా ఆధారాలు లేవు.’’ త్రిపురనేని మధుసూధనరావు (కవిత్వం చైతన్యం, పుట 96). ఏక రూపత భారతీయ స్వభావం కాదని ఒకవైపు చెప్తూనే- భారతదేశంలో ఒకే జాతి- ఒకే సంస్కృతికి అవకాశం కల్పించిన మహోన్నత భాషగా సంస్కృతాన్ని కీర్తిస్తున్నారు. భారతదేశ చరిత్రలో- భారత జాతి ఏక జాతిగా వర్ధిల్లిన సందర్భం పూర్వం లేనే లేదు. ఎక్కడికక్కడ సంస్కృతీ సంప్రదాయాలలో- వేష భాషలలో- ఆహార, విహారాలలో అనేక రకాల వైవిధ్యాలున్నాయి. అందుకే భారతదేశాన్ని మేధావులు ఉపఖండంగా పిలుచుకుంటారని గుర్తించాలి. వైవిధ్యాల మధ్య వైరుధ్యాలు లేవనటం బుకాయించటమే. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు మాట్లాడుకుంటున్న భాషకు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బలవంతంగా అలవాటయిన రాతపూతల భాషకు- అంటే కాళోజీ భాషలో చెప్పాలంటే ‘రెండున్నర జిల్లాల- రెండున్నర కులాల భాష’కూ మధ్య వైరుధ్యం లేదని నిరూపించగలరా? అలాంటి వైరుధ్యమే ప్రాచీన కాలం నుంచీ పాలక వర్గాలకు మాత్రమే చెందిన సంస్కృత భాషకూ- ఆయా కాలాల్లోని ప్రజల భాషలకూ మధ్య వుందన్న సంగతి దాచేస్తే దాగని సత్యం. అలాంటి భాషను మొత్తం తెలుగు పాఠశాలల్లో ప్రథమ భాషగా చేయాలనటమంటే- సామాన్య ప్రజలకు చదువునూ, విజ్ఞానాన్ని దూరం చేయమని ఇంకో రూపంలో డిమాండ్ చేయటమే. నూతన పాఠ్య పుస్తకాలన్నీ స్థానిక మాండలిక భాషల్లోనే రూపొందించాలని మేధావులందరూ ఒకే గొంతుగా నినదిస్తున్న ఇదే సందర్భంలో- దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రజలకేమాత్రమూ సంబంధం లేని- సంస్కృతంలో పిల్లలు చదవాలని శాసించటాన్ని కుట్ర అనకపోతే మరేమని పిలుద్దాం!
బోధనా భాషగా, పాలనా భాషగా, అనుసంధాన భాషగా వున్న సంస్కృతాన్ని ఆంగ్లేయులు వచ్చి అక్రమంగా తొలగించారట! ఎందుకీ అబద్ధాలు! సంస్కృతానికేనాడైనా బోధనా భాషగా, పాలనా భాషగా, అనుసంధాన భాషగా వున్న చరిత్ర వుందా? వుంటే ఆధారాలతో సహా నిరూపిస్తే అందరం సంతోషిస్తాం కదా! అసలలాంటి పరిస్థితి రాజుల కాలంలోనూ లేదు. ప్రసిద్ధ పరిశోధకుడూ, విమర్శకుడూ అయిన తాపీ ధర్మారావు ఏమన్నాడో విన్నారా? ‘‘పురోహితుడుగారి సంస్కృతం వినే జన సామాన్యం ఉండేది కాదన్నాడు. (కొత్తపాళి- తాపీ ధర్మారావు, పుట 12).
ఈ వ్యాసంలో హెబ్బార్‌గారు చేసిన మరో పెద్ద తప్పు- ఇందులోకి అంబేద్కర్‌ను లాగటం. ‘స్వతంత్ర భారత రాజ్యాంగ సభలో- అంబేద్కర్ సంస్కృత భాషను భారత ప్రభుత్వ అధికార భాషగా చేయాలన్న ప్రతిపాదన తీసుకవచ్చినట్టు హెబ్బార్‌గారు చెబుతున్నారు. ఆయన సభలో ఏ తేదీన ఆ ప్రస్తావన తెచ్చాడో- లేదా ఆ ప్రస్తావనకు హెబ్బార్‌వారి దగ్గర గల ఆధారమేమిటో చెప్పలేదు. అంబేద్కర్‌గారి భావజాలానికి విశ్వాసానికి వ్యతిరేకంగా మహాపకారం చేశారు. జీవితాంతం బ్రాహ్మణీయ భావజాలం మీద, హిందూమతం (సంకుచితార్థంలో చూడాలి- ప్రజల మీద ఆధిపత్యం చెలాయించే ఆధిపత్య మతవాదుల మీదనే) మీద, సాంఘిక సమస్యగావున్న అస్పృశ్యత అనే సమస్య మీదా పోరాడిన అంబేద్కర్ అలాంటి ప్రతిపాదన పెట్టే అవకాశమే లేదు. చివరగా ఒక కవి రాసిన వాక్యాలతో ఈ వ్యాసాన్ని ముగించటం సమంజసంగా వుంటుందని భావిస్తున్నాను.
జాతీయ భాష కాగల సిరి
సంస్కృతానికెప్పుడు?
మరణించిన కళేబరం
మాట్లాడేటప్పుడు.