సాహితీ చైతన్యకారుడు ‘దేవులపల్లి’
-తోకల రాజేశం 17/09/2013
********************************************
తెలంగాణను కేంద్రంగా చేసుకుని తెలుగు వారిలో తెలుగు భాషా సాహిత్యాల చైతన్యాన్ని-సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించడమే ప్రధాన ధ్యేయంగా 1943లో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఏర్పాటైంది. దీని ఏర్పాటుకు సంబంధించి మొదట్లో కృషి చేసిన వారిలో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రంగనాధరావు, భాస్కరభట్ల కృష్ణారావులు ముఖ్యులైనప్పటికీ వాళ్ల తరువాత ఇప్పుడధ్యక్షులుగా ఉన్న సినారె కంటే ముందు-సారస్వత పరిషత్ కోసం జీవితాంతం పనిచేసిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే దేవులపల్లి రామానుజరావు. (గడియారం రామకృష్ణశర్మగారి కృషి కూడా గొప్పదే). వరంగల్లు దగ్గరి దేశాయిపేటలో 1917 ఆగస్టు 25న జన్మించిన దేవులపల్లి, కాళోజీ కంటే మూడేళ్లు, సురవరం ప్రతాపరెడ్డి కంటే ఇరవై యేళ్లు చిన్నవాడు. కానీ తర్వాతి కాలంలో వాళ్లిద్దరి గ్రంథాలకు ముందు మాటలు రాసే అవకాశం సంపాదించుకుని -పెద్ద మనసున్న రచయితగా ఎదిగాడు. మొదట్లో ఒక పక్క వ్యవసాయం చేసుకుంటునే రచనలు చేస్తుండేవాడు. గోలకొండ పత్రికలో వీరి వ్యాసాలు వస్తుండేవి. మాడపాటి హనుమంతరావు ప్రోత్సాహంతో పూర్తిస్థాయి సాహిత్య, సాంస్కృతిక కార్యకర్తగా అడుగులు వేయడం ప్రారంభించాడు. సురవరం ప్రతాపరెడ్డి లాగే-రామానుజరావు కూడా ఒక పక్క నిరంతరం రచనలు చేస్తునే-మరోపక్క ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించగల వివిధ సంఘాలతో కలిసి పనిచేస్తుండేవారు. దేవులపల్లి ‘పచ్చతోరణము’ లాంటి కావ్యాలు రాసినప్పటికీ ఆయన విమర్శకునిగానే, వ్యాస రచయితగానే ఎక్కువ శ్రమపడ్డాడు. ‘సారస్వత నవనీతం’, ఉపన్యాస తోరణం ఆయన విమర్శనా గ్రంథాలు. ఆయన పుస్తకాల పట్టీలో ఇంకా అనేక గ్రంథాలున్నాయి. చాలామంది విస్మరించారు కానీ, ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించి-తొలి, మలి తరాల మధ్యతరానికి చెందిన సాహిత్య విమర్శకులు దేవులపల్లి రామానుజరావు. తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే తత్వం ఆయనది. అయినప్పటికీ ఎవరినీ నొప్పించకుండా అందరినీ ఒప్పించే విధంగా ఉండేదాయన పద్ధతి. అందుకే ఆయన రామానుజరావుగారి వ్యాసాల్లో ఏ రచయితనూ పరుషంగా ఒక్క మాట అనలేదు. రామానుజరావు ముఖ్యంగా మూడు రకాల సాహిత్యాల మీద ఎక్కువగా కృషి చేసారు. ఒకటి ప్రాచీన సాహిత్యం, రెండు సమకాలిక సాహిత్యం, మూడు జానపద సాహిత్యం. ఈ మూడు విభాగాల్లోనూ మళ్లీ కవిత్వం మీదనే ఎక్కువ కృషి చేసారాయన. ప్రాచీనాధునిక కవులను సమానంగా ఆదరించడానికి-దేవులపల్లిలో ఎక్కడో ఒక వైరుధ్యం ఉండి తీరాలి. లేకపోతే ఏకకాలంలో విశ్వనాధనూ, అభ్యుదయ కవులనూ ఇష్టపడడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? కాకపోతే జానపద కవిత్వం మీద రామానుజరావు గారికి గల శ్రద్ధ తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు చేసింది. ‘ఆధునిక యుగమున ఆంధ్ర భాషా పునర్వికాసారంభమున పునరుద్ధరించవలసినఈ పాటలు ఎన్నియో వర్గములుగా నున్నవి’ అని మొట్టమొదటిసారిగా జానపద గేయాలను వర్గీకరించిన వారు రామానుజరావు. మొదటిసారిగా-తెలుగు సాహిత్యంలో-జానపద సాహిత్యం ఎలా గొప్పనైనదవుతుందో-రుజువు చేసి చూపించినవారు దేవులపల్లి రామానుజరావు. అలాగే పోతనను శృంగార కవిగా ప్రతిపాదించిన వాళ్లు తెలుగు సాహిత్యంలో రామానుజరావుగారు తప్ప ఇంకొకరు లేరు. ఆయన 1956లో ‘శృంగారకవి పోతన’ అనే వ్యాసం రాసారు. ఇక దేవులపల్లి వారి శైలి విషయానికి వస్తే-ఆయన శైలి గ్రాంథికమూ కాకుండా-ఇటు వ్యవహారికమూ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. చేరా గారీ శైలిని ‘ఉదార సరళ గ్రాంధిక’ మన్నారు. సురవరం వారిలాగే దేవులపల్లి రామానుజరావు గారు కూడా తన సాహిత్యాన్ని-జీవితాన్ని తెలుగు ప్రజల ముఖ్యంగా తెలంగాణ ప్రజల సాంస్కృతిక వికాసం కోసం ఉదారంగా ధారపోసిన మహానుభావుడు.
No comments:
Post a Comment