Tuesday, 28 October 2014

అవసరం తీరిపోని రచయిత

 - తోకల రాజేశం 28/10/2014
నేడు కొ.కు. జయంతి
నిజమైన సాహిత్యం మన సమాజంలో వుండే క్రూరత్వాన్నీ, పైశాచికత్వాన్నీ బయటపెట్టాలి. అప్పుడే అది ప్రజలకు సంబంధించిన సాహిత్యమవుతుంది’’ అని ఒక సందర్భంలో ప్రకటించిన కొడవటిగంటి కుటుంబరావు- తన జీవితాంతం అచ్చంగా అలాంటి సాహిత్యానే్న సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానంతరం ప్రజల సాంస్కృతిక జీవితం మీద చెరిగిపోని ప్రభావాన్ని వేసిన అతికొద్దిమంది తెలుగు మేధావుల్లో కుటుంబరావు ఒకరు. కుటుంబరావు ప్రధానంగా సాహిత్య జీవే అయినప్పటికీ ప్రజల సాంఘిక జీవితంతో సంబంధమున్న ప్రతీ అంశం మీద- అది చిన్నదైనప్పటికీ- తనదైన దృష్టిని సారించారు. తనకు గల దృక్పధంతో ప్రతీ అంశంమీద వెలుగును ప్రసరించాడు. తాను జీవితాన్ని- సాహిత్యాన్ని సక్రమమైన రీతిలో అవగాహన చేసుకోవడానికి తనకు ప్రాపంచిక దృక్పధముండటమే కారణమని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
సాహిత్యమీద, అది సామాజిక వికాసంలో భాగంగా నిర్వహించవలసిన పాత్ర మీదా స్పష్టమైన అభిప్రాయాలు కలిగినవాడు కుటుంబరావు. ఆయన తన ఈ అభిప్రాయాలను సాహిత్య విమర్శద్వారా ప్రత్యక్షంగా- కథలూ, నవలలూ, గల్పికల ద్వారా పరోక్షంగా బయటపెట్టారు. సాహిత్యానికొక ప్రయోజనముంటుందని బలంగా నమ్మి- ఆ ప్రయోజనాన్ని సాధించటానికి తన కాలంలోని మరెవ్వరూ చేయనంత సాహిత్య కృషి ఆయనొక్కడే చేశారు. అందుకే ఆయన రచనలు రాశిలోనే గాక వాసిలోనూ గొప్పవని విమర్శకులంటారు. కొ.కు. తన నవలల్లో, కథల్లో చిత్రించిన పాత్రలు తమ కాలంకంటే ఎంతో ముందుచూపుతో ప్రవర్తిస్తాయి. విమర్శనాత్మకంగా ఆలోచిస్తాయి. వ్యక్తి వికాసాన్ని అడ్డుకోవడానికి కులమూ, మతమూ కల్పించిన అడ్డుగోడల్ని కూల్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తాయి. అంటే ఈ పాత్రల్లోని ముందు చూపంతా కుటుంబరావుది. గురజాడ తరువాత ఇంత ముందుచూపు కలిగిన తెలుగు రచయితల్లో ఒక్క కుటుంబరావు తప్ప మరొకరు లేరు.
అయితే కుటుంబరావును పాఠకులు గుండెల్లో పెట్టుకోవడానికి ఆయన ముందుచూపు ఒక్కటే కారణం కాదు. శైలి కూడా ప్రధాన కారణమే. ‘‘తాము చేసే పనిలో భేషజం అనేది అణుమాత్రం కూడా లేని వాళ్లకు డళచిష్యశఒషజ్యఖఒశళఒఒ అనేది అంటదు. దాన్ని జయించటం అన్న సమస్యే వాళ్లకు కలగదు. కుటుంబరావుగారి తత్వం సరిగా అలాంటిదే నన్నాడో సందర్భంలో రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆ తత్వంనుంచి పుట్టిందే ఆయన శైలి. అందుకే ఏ ఆడంబరాలు లేకుండా- నిండు జీవితాన్ని అనుభవించిన వొక పెద్దమనిషి మాట్లాడుతున్నట్లుంటుందాయన శైలి. అందుకే ఆయన సీరియస్ పాఠకుల దగ్గరినుంచి సామాన్య పాఠకుల దాకా అందరినీ మెప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా మామూలు పత్రికలకు కూడా రాసేవారు. తన భావజాలాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో దేనె్నలా వాడుకోవాలో కుటుంబరావుకు బాగా తెలుసు.
‘‘జీవితాన్ని పురస్కరించుకొని పుట్టిన సాహిత్యం జీవితంలో విహితంగా వుండదు. జీవితం మీద తిరగబడుతుంది. జీవితాన్ని కోసి పరీక్ష చేస్తుంది. జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తుంది’’ అంటారు కుటుంబరావు. కుటుంబరావు సాహిత్యం చేసిన పని కూడా అదే. ఈనాటి సామాజిక పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే కొడవటిగంటి వారి అవసరం ఆనాటి కంటే ఈనాడే ఎక్కువుందని అనిపిస్తుంది. ఆ అవసరాన్ని ఆయన సృష్టించి పెట్టిన సాహిత్యం తప్పకుండా తీరుస్తుంది.